త్వరలోనే రుణమాఫీ విధివిధానాలను రూపొందిస్తాం: మంత్రి పొన్నం
రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 6:40 AM ISTత్వరలోనే రుణమాఫీ విధివిధానాలను రూపొందిస్తాం: మంత్రి పొన్నం
తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీన్ని అమలు చేయడంలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు రైతురుణమాఫీ అమలు చేసేందుకు కసరత్తులను వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ లోపు చేస్తామనీ చెబుతోంది. తాజాగా రుణమాఫీ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విడతల వారీగా కాకుండా ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు ఊరట కలిగిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కామెంట్స్ చేశారు. తాను కూడా ఇందులో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం ఇదే అవుతుందన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారనీ.. ఇచ్చిన మాటలకు తాము కట్టుబడి ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విధివిధానాలతో సంబంధించిన జీవోను విడుదల చేస్తాం. గతంలో విడతలా వారీగా రుణమాఫీ జరిగేదనీ.. ఇప్పుడు అలా ఉండదన్నారు. రైతుబిడ్డగా సహచర మంత్రులు, ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.