ఆందోళన వద్దు.. ఆటోవాళ్లకూ న్యాయం చేస్తాం: పొన్నం ప్రభాకర్
ఆటో డ్రైవర్ల ఆందోళనలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 4:12 PM ISTఆందోళన వద్దు.. ఆటోవాళ్లకూ న్యాయం చేస్తాం: పొన్నం ప్రభాకర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే..దీని వల్ల బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సు సర్వీసులు తక్కువగా ఉన్న రూట్లలో అయితే రద్దీ విపరీతంగా ఉంది. కాలుపెట్టే చోటు కూడా లేకపోవడంతో కొందరు ఫుట్‌బోర్డు.. ఇంకొందరు బస్సు వెనకాల ఉండే మెట్లపై ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉపయోగకరంగానే ఉన్నా.. కాస్త ఇబ్బందులు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ మహాలక్ష్మీ పథకం ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం చేకూరుస్తోందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో తమకూ న్యాయం చేయాలని పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. కాగా..ఆటో డ్రైవర్ల ఆందోళనలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంగళవారం రోజు 5,126 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని ఫిర్యాదుల్లో పేర్కొన్నారని అన్నారు. అలాగే నిరుద్యోగులు కూడా ఫిర్యాదులను అందించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరి సమస్యలను పరిస్కరిస్తామని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్ల ఆందోళనలు తన దృష్టికి వచ్చాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. వారికి కూడా త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనీ చెప్పారు. ఆటోవాళ్లు తమ సోదరులే అనీ.. కచ్చితంగా వారిని ఆదుకుంటామన్నారు. ఆటోవాళ్ల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.