సింగరేణి కార్మికులకు రూ.20 లక్షల వడ్డీలేని రుణాలు: మంత్రి పొంగులేటి

సింగరేణి ఎన్నికల్లో కూడా ఐఎన్‌టీయూసీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 5:21 AM GMT
minister ponguleti,  singareni, congress ,

సింగరేణి కార్మికులకు రూ.20 లక్షల వడ్డీలేని రుణాలు: మంత్రి పొంగులేటి

ఇల్లందులోని సింగరేణి జేకే ఓపెన్‌ కాస్ట్‌ కార్యాలయం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన పిట్‌ మీటింగ్ నిర్వహించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో కార్మిక సోదరులంతా ఐఎన్‌టీయూసీని ఆదరించాలని కోరారు. అలాగే కాంగ్రెస్‌ను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో కోరం కనకయ్యను అధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సింగరేణి ఎన్నికల్లో కూడా ఐఎన్‌టీయూసీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

కార్మికుల గుండెల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని.. అందుకే కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీతో గెలిపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సింగరేణిలో టీబీజీకేఎస్‌ మాయమాటలు చెప్పి రెండు సార్లు గెలిచిందని అన్నారు. బీఆరెస్‌ పార్టీలో ఉండి మోసపోయి గోసపడి ఇవాళ విముక్తి అయ్యారని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం తానెప్పుడూ కృషి చేస్తానని పొంగులేటి చెప్పారు. ఐదేళ్లలో 15వేల మంది ఉద్యోగుల తగ్గింపు జరిగిందనీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం రెండు లక్షల ఉద్యోగాలను కల్పించే కార్యక్రమం చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20లక్షల వడ్డీలేని రుణాన్ని అమలు చేయనుందని చెప్పారు. జేకేఓసీ ఎక్స్‌టెన్షన్ చేస్తామనీ.. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ మినహాయింపు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురానుందని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు న్యాయంగా జరగలేదని విమర్శించారు. అప్పుడు కారుణ్య నియామకాల కోసం ఉద్యోగానికి రూ.4లక్షలు చేతులు మారాయని ఆరోపించారు. కారుణ్య నియామకాల కోసం ఖర్చు పెట్టకుండా వాటిని ఇప్పించే బాధ్యత తనదని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

Next Story