రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...

By -  అంజి
Published on : 14 March 2026 9:28 AM IST

Ponguleti Srinivasa Reddy Indiramma Houses, Telangana Housing Scheme Phase 2, Khammam Development Works Kamepalli, Indiramma Houses Status March 2026, Revenue Minister Housing Update

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన 'ఇందిరమ్మ ఇళ్ల' నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి వెల్లడించారు.

ఈ మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవాడికి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలు అధికారంలో ఉండి కూడా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని మంత్రి విమర్శించారు.

కేవలం మాటలకే పరిమితమైన గత పాలకుల వల్ల పేదలకు అన్యాయం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే కాంగ్రెస్ ప్రభుత్వం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

Next Story