6 రోజుల్లో 76వేల ధరణి సమస్యలను పరిష్కరించాం: మంత్రి పొంగులేటి

ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  7 March 2024 8:30 PM IST
minister ponguleti, comments,  dharani, telangana,

6 రోజుల్లో 76వేల ధరణి సమస్యలను పరిష్కరించాం: మంత్రి పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీల అమలుపై ముఖ్యంగా ఫోకస్‌ పెట్టింది. అధికారంలోకి వచ్చినవెంటనే రెండు హామీలను అమలు చేయగా.. ఇటీవలే 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్ పథకాలను అమలు చేస్తోంది. అంతేకాదు.. ఇతర విషయాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పలు విషయాలను వెల్లడించారు.

ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. స్పెషల్‌ డ్రైవ్ ద్వారా ధరణి సమస్యలు ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నట్లు వెల్లడించారు. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణిలో స్పెషల్‌ డ్రైవ్ ద్వారా కేవలం 6 రోజుల్లోనే 76వేలకు పైగా సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల సమస్యలను పెండింగ్‌లో ఉంచారనీ.. వాటిని క్లియర్ చేసే పనిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు నిమగ్నమై ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ధరణిలో సమస్యల పరిష్కారంలో భాగంగా ఎమ్మార్వో స్థాయి అధికారులతో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోందని చెప్పారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. అందుకే లక్షల సమస్యలు తలెత్తాయన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ధరణికి సంబంధించి రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్పైషల్ డ్రైవ్ కొనసాగుతోందనీ.. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Next Story