తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరగడంపై మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే తమ ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేశారని ఆరోపించారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో తాను టర్కీలో ఉన్నానని, దాడుల గురించి తనకు ఎవరూ చెప్పలేదని, మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు తమ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్లను అధికారులు సీజ్ చేశారన్నారు. ఐటీ అధికారులు వేట కుక్కల్లా దాడి చేశారన్నారు.
దాడుల తీరుపై మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 75 ఏళ్లు పైబడిన తన తండ్రిని ఐటీ అధికారులు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇంటికి బయటికి తిప్పారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి, కళాశాలలకు తిప్పుతూ ఇబ్బందులు సృష్టించారన్నారు. విచారణల పేరుతో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ కుటుంబం టీఆర్ఎస్ పార్టీని వీడాలన్నేదే ఈ ఐటీ దాడుల మోటివ్ అయి ఉంటుందని రాజశేఖర్ రెడ్డి వివరించారు. తన ఇంట్లో ఐటీ అధికారులు రెండు డిజిటల్ లాకర్లను సీజ్ చేశారన్న వదంతులను ఆయన కొట్టిపారేశారు.
రాజశేఖర్ రెడ్డి ఇంట్లో మూడు కోట్ల నగదు దొరికిందన్న వార్తలపై స్పందిస్తూ.. అదేమీ పెద్ద విషయం కాదని అన్నారు. తన పర్యవేక్షణలో ఐదు విద్యాసంస్థలు నడుస్తున్నాయని వెల్లడించారు. ఒక్కో విద్యాసంస్థలో సిబ్బందికి వేతనాల ఖర్చు రూ. 2 కోట్లు. ఐదు విద్యాసంస్థల్లో నెలకు మొత్తం రూ.10 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. అలాంటిది రూ.3కోట్లు దొరకడం పెద్ద విషయమేమీ కాదన్నారు. తన కూతురు, అమ్మానాన్నల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఐటీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు ఐటీ దాడుల్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.