చంద్రబాబు బంగారం లాంటి మనిషి: మంత్రి మల్లారెడ్డి

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మరోసారి బీఆర్‌ఎస్‌ నేత, మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు బంగారం లాంటి మనిషి అని అన్నారు.

By అంజి  Published on  17 Nov 2023 6:49 AM GMT
Minister Mallareddy, Chandrababu arrest, Telangana Polls

చంద్రబాబు బంగారం లాంటి మనిషి: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ భారత రాష్ట్ర సమితి నేతలు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ వస్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మరోసారి బీఆర్‌ఎస్‌ నేత, మంత్రి మల్లారెడ్డి స్పందించారు. గురువారం ఓ న్యూస్‌ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లారెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బంగారం లాంటి మనిషి అని, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను ఏడ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఏపీ దివాళా తీసిందని మల్లారెడ్డి ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలనుకున్నానని, అయితే పరిస్థితులు పార్టీ మారేలా చేశాయన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణలో తానొక్కడే టీడీపీ నుంచి గెలిచారని మల్లారెడ్డి గుర్తు చేశారు.

''ఐదారు ఎకరాలకు తప్పితే.. నేను రైతు బంధు తీసుకోను. రైతుబంధు నా అకౌంట్లో ఎంత పడుతుందో కూడా నాకు తెలియదు. రేవంత్‌ రెడ్డి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. రేవంత్‌ రెడ్డి ఇంత గొప్పోడు ఎలా అయ్యాడు. నన్ను రేవంత్‌ రెడ్డి ఎంతో ఇబ్బంది పెట్టాడు. టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ సీటు వదులుకో, లేకపోతే నీ కాలేజీలు బంద్‌ చేయిస్తా అని బెదిరించాడు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులుండొచ్చు.. వాటిని సరి చేసుకుంటా. చంద్రబాబును నా టాలెంట్‌తో ఇంప్రెస్‌ చేశా. చంద్రబాబును కలిసి మూడు టికెట్లు కావాలని అడిగా. నాలాంటి వాళ్లు కావాలని చంద్రబాబు రాజకీయాల్లో తీసుకున్నారు'' అని మల్లారెడ్డి అన్నారు.

తన దగ్గర పర్‌ఫెక్ట్‌ పాన్లింగ్‌, హార్డ్‌వర్క్‌, క్రమశిక్షణ ఉందన్నారు. అప్పుడు టీడీపీలో గెలిచిన వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీలో ఎంపీగా గెలిచాక తాను ఒక్కడినే ఏకాకిని అయ్యానని, అందుకే తాను కూడా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరానన్నారు. తాను ఎక్కడా భూమి కబ్జా చేయలేదన్నారు. సుమారు 800 ఎకరాల భూమి ఉందని మల్లారెడ్డి తెలిపారు. తాను జీవితంలో సాధించాల్సింది ఇంకేం లేదన్న మంత్రి తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ఖండించారు. తాను గుంట భూమి కూడా ఎవరిది కబ్జా చేయలేదన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఇకపై పోటీ చేయనని వెల్లడించారు.

Next Story