టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటా : మంత్రి కేటీఆర్‌

Minister KTR speech in Chanduru.మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్తత తీసుకుంటాన‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2022 10:19 AM GMT
టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటా : మంత్రి కేటీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్తత తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక.. కాంట్రాక్ట‌ర్ అహంకారానికి మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య ఎన్నిక అని అన్నారు. టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డి ఏనాడు నియోజ‌క‌వ‌ర్గం గురించి ప‌ట్టించుకోలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. మునుగోడు ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్దిన ఎన్నిక ఇది అని అన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి ప‌నైనా చేశారా..? అని ప్ర‌శ్నించారు. ఏ గ్రామానికైనా అభివృద్ధి ప‌నులు కావాల‌ని జిల్లా మంత్రి వ‌ద్ద‌కు వెళ్లారా..? అని దుయ్య‌బ‌ట్టారు.

మునుగోడు ప్ర‌జ‌ల క‌ష్టం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలుసున‌ని చెప్పారు. పదేళ్ల‌కు ముందు మునుగోడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఓ సారి ఆలోచించాల‌న్నారు. ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను ప్ర‌ధానులు సైతం ప‌ట్టించుకోక‌పోయినా కేసీఆర్ ప‌రిష్క‌రించార‌న్నారు. ఫ్లోరోసిస్ నిర్మూల‌న కోసం రూ.19వేల కోట్లు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ రాజ‌గోపాల్‌రెడ్డికి ఇచ్చార‌న్నారు.

టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ని గెలిపిస్తే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని చెప్పారు. న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తానన్నారు. అభివృద్ధిలో అండ‌గా ఉంటాను. రోడ్ల‌ను అభివృద్ధి చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచండి. త‌ప్ప‌కుండా అభివృద్ధిలో ప‌య‌నిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచేందుకు కృషి చేద్దామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story