తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్‌పై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ''టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు అధికారులను నియమించబోతోంది. దీని ద్వారా పౌర సమస్యలపై మరింతగా దృష్టిసారించవచ్చు. వార్డు కౌన్సిలర్‌లతో సమన్వయం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సీఎం కేసీఆర్‌కు నా కృతజ్ఞతలు'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 డిపార్ట్మెంట్లలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షలో చేర్చబడిన సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్, సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు. TSPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.