తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లోనే ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా వేగంగా సాగుతోందన్నారు. సనత్‌నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్‌కి టెక్ మహీంద్రా సంస్థ అందించిన ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు 7 అంబులెన్స్‌లను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
మహీంద్రా గ్రూప్ ఒక్క రంగానికే పరిమితం కాలేదన్నారు. అనేక రంగాల్లో ముందుకు వెలుతుందన్నారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మహీంద్రా గ్రూప్.. జహీరాబాద్‌లో లక్ష పైచిలుకు ట్రాక్టర్లు తయారు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోనే టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నారు. ఆ సంస్థ కార్యకలాపాలను వరంగల్‌లోనూ విస్తరించారన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్‌లు అందించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.