బీఆర్ఎస్‌ గెలిచాక.. ఈసారి పర్యాటకశాఖ అడుగుతా: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  18 Nov 2023 7:41 AM IST
minister ktr,  BRS, tourism department,

బీఆర్ఎస్‌ గెలిచాక.. ఈసారి పర్యాటకశాఖ అడుగుతా: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అధికారం చేపట్టేందుకు హామీలు ఇస్తున్నాయి. అయితే.. మంత్రి కేటీఆర్ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాక్యల చేశారు. బిజినెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో పర్యాటక రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక తనకు పర్యాటక శాఖ ఇవ్వాలని సీఎంను కోరుతానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ఏర్పడ్డాక ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని తాము చేసి చూపించామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా మినహా తమకు దొరికిన ఆరున్నర ఏళ్ల కాలంలో అనూహ్య అభివృద్ధి సాధించామన్నారు. తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగిన తర్వాత ఇవి ఇంకా మెరుగయ్యాయన్నారు. హైదరాబాద్‌ పరిసరాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉందని, గండిపేట, హిమాయత్‌సాగర్‌ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యాటకులకు వసతులను పెంపొందించాల్సి ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండవనీ.. పారిశ్రామిక కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోందన్నారు. తమిళసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ నటులు, బీజేపీ ఎంపీ సన్నీదేవల్‌ కూడా చెప్పారని అన్నారు. కానీ ప్రతిపక్ష నేతలకే ఇక్కడ అభివృద్ధి కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story