మెట్రో రైల్‌ విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎయిర్‌పోర్టు మెట్రో సహా ఇతర మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 11:57 AM GMT
Minister KTR, review Meeting,  hyderabad, metro rail ,

 మెట్రో రైల్‌ విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష 

మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎయిర్‌పోర్టు మెట్రో సహా ఇతర మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై హైదరాబాద్‌లోని మెట్రో రైల్‌ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి ఎ. శాంతికుమారి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్తాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్లోబల్‌ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని.. అందుకు అనుగుణంగా ప్రతిఒక్కరం పనిచేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రద్దీ, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ను అన్నింట్లో పోటీ పడేలా మార్చాలని అన్నారు. ప్రజా రవాణాను ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు మంత్రి కేటీఆర్.

నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే మెట్రో రైల్ విస్తరణ అని పేర్కొన్నారు. మరిన్ని కోచ్‌లను ప్రవేశపెట్టడం, ఫీడర్ సేవలను మెరుగుపర్చడం, మెరుగైన ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత మెట్రో రైడర్‌ షిప్‌ రోజుకు 5 లక్షలను రెట్టింపు చేయగలదని చెప్పారు. తద్వారా నగరంలో వాహనాల రద్దీని తగ్గించవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మెట్రో రైల్‌ ఎండీ శ్రీ ఎన్వీస్‌ఎస్‌ చేసిన వివరనాత్మక పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌పైనా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించడానికి గుర్తించిన ప్రభుత్వ ఆస్తులను వెంటనే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్‌కు అప్పగించాలని సంబంధిత శాఖలు, సంస్థలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మెట్రో రైల్ డిపో నిర్మాణానికి ఎయిర్‌పోర్టు ప్రాంతంలో 48 ఎకరాల భూమిని అప్పగించాలని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ అధికారులను ఆదేశించారు. సమన్వయ సమావేశాలు నిర్వహించాలని మరియు ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌ను త్వరితగతిన అమలు చేయాలని మంత్రి కేటీఆర్ సీఎస్‌ను కోరారు. క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన అన్ని కొత్త మెట్రో కారిడార్‌ల సర్వేలను ప్రారంభించాలని, వాటిని భారత ప్రభుత్వానికి పంపడానికి రాబోయే కొద్ది నెలల్లో ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ మెట్రో రైల్‌ ఎండీని ఆదేశించారు.

కొత్త మెట్రో ప్రాజెక్టుల కోసం నిధుల ఎంపికలను అన్వేషించాలని అధికారులకు చెప్పారు. అలాగే హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు.. సీఎం కేసీఆర్ కోరినట్లు మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన మెట్రో స్టేషన్‌లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీతో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాతబస్తీ మెట్రో కారిడార్‌ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి.. అక్కడ నిర్మాణాన్ని ప్రారంభించాలని మెట్రో రైల్ ఎండీని కేటీఆర్ ఆదేశించారు.

Next Story