కామారెడ్డి జిల్లా నూతన మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతి సదస్సును ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని పరిస్థితి గురించి ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. రైతుల నిరసన విషయమై వివరాలు తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే ఇచ్చామని చెప్పిన కేటీఆర్.. ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు.
అభ్యంతరాలుంటే ముసాయిదాలో మార్పులు చేర్పులు చేస్తామని, వినతులు, అభ్యంతరాలుంటే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. 500 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్‌గా మారుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రజలకు ప్రతి విషయాన్ని వివరించాలని సూచించారు. రైతు ఆత్మహత్య వార్త పత్రిక ద్వారా తన దృష్టికి వచ్చిందని, రైతులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని కేటీఆర్ అన్నారు. నిర్మాణాత్మక నగరాలు, పట్టణాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రజలకు అనుకూలంగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలని సూచించారు.