హైదరాబాద్‌: మేయర్‌ పీఠం తమదే: మంత్రి కేటీఆర్‌

Minister KTR Press Meet In Hyderabad.. దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

By సుభాష్  Published on  19 Nov 2020 7:45 AM GMT
హైదరాబాద్‌: మేయర్‌ పీఠం తమదే: మంత్రి కేటీఆర్‌

దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ దిప్రెస్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందని దుష్ర్పచారం చేశారని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎన్నో పుకార్లు సృష్టించారని అన్నారు. కొత్త పెట్టుబడులు కాదు.. ఉన్న పెట్టుబడులు కూడా పోతాయని, ప్రజల్లో అపోహాలు నిండేలా ప్రచారం చేశారని అన్నారు. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ విద్యుత్‌ ఉత్పత్తిని సాధించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా సమస్య లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

దశబ్దాల పాటు వెనుకబాటుతనానికి గురైన తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హైదరాబాద్‌ అనిశ్చిత ఉండేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే కేసీఆరే కారణమన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌పై లేనిపోని దుష్ప్రచారం చేసినవారంతా నేడు కనుమరుగయ్యారని గుర్తు చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా.. కేసీఆర్‌ పట్టించుకోకుండా అభివృద్దిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌ పటిష్టమైన శాంతిభద్రతలు ఉన్నాయన్నారు. అలాగే నగరరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉగాదికి ప్రారంభిస్తామన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే 150 స్థానాల్లో పోటీ చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఐదు చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈ సారి 10 చోట్లకుపైగా ఎంఐఎంను ఒడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ఫలితాలనే బీజేపీ మరోసారి ఎదుర్కొంటుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు కావస్తోందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరున్నరేళ్లుగా బాధ్యతాయుంగా పని చేస్తున్నామన్నారు. గతంలో హైదరాబాద్‌లో 15 రోజుకోసారి మంచినీళ్లు వచ్చేవని, అలాంటిది కేసీఆర్‌ సీఎం అయ్యాక మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో, ప్రపంచంలో 16వ స్థానంలో ఉందన్నారు. ఔషధ రంగంలో కూడా హైదరాబాద్‌ ముందుకెళ్తోందని, పేదల కోసమే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అందుబాటులోకి తెచ్చామని, రూ.9,714 కోట్లతో లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌లను నిర్మిస్తున్నామన్నారు. దశలవారీగా అందించి పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Next Story
Share it