ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశంతో టీటీడీ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్లలో రూ 2 కోట్లతో పురాతన శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయానికి, ఎల్లారెడ్డి పేటలో రూ 2 కోట్లతో పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ జీర్ణోద్ధరణ(పునఃనిర్మాణ) పనులకు మంత్రి కేటీఆర్ కలసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ కింద అనేక పురాతన ఆలయాల జీర్ణోద్దరణకు టీటీడీ నిధులు మంజూరు చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో 2500కు పైగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలు సుఖ శాంతులతో వెలుగొందాలని ఆయన కోరారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా కలసి ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ధి సాధించాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన వెంటనే ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేయించిన ఎపీ సీఎం వైఎస్ జగన్ కి కృతఙ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ రవీంద్ర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.