హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పీపుల్స్ ప్లాజా వద్ద చెత్త తరలించే 40 అత్యాధునిక వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ నగరంలో అయినా రెండు రకాల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయన్నారు. అందులో ఒకటి సాలిడ్, మరోకటి వేస్ట్.
స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు పరిష్కారాలు వెతుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. ఇక 2014లో 2500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే ప్రస్తుతం 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు అందుబాటులో ఉన్నాయి. నెలరోజుల వ్యధిలో మరో 400 ఆటోలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వీటిని 150 డివిజన్లలో డోర్ టు డోర్ కలెక్షన్‌కు వినియోగిస్తామన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా పని చేయాలి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.