దేశంలో సృష్టించిన ఐటీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణ నుంచే: కేటీఆర్
తెలంగాణలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని కేటీఆర్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 5:57 AM GMTదేశంలో సృష్టించిన ఐటీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణ నుంచే: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు లభించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో భూముల రేట్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. కోకాపేటలో భూముల ధర రికార్డులను తిరగరాసిందని.. ఎకరం రూ.100 కోట్లకు పైగా వేలం పలికిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు మంత్రి కేటీఆర్. కానీ ఇవేమీ తెలియనట్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు. కొందరు నాయకులు అయితే.. హైదరాబాద్‌లో ఐటీని మేమే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ.. తాము అలా చెప్పుకోమని అన్నారు మంత్రి కేటీఆర్. నగరానికి 1987లో మొట్టమొదటి పరిశ్రమ వచ్చిందని అన్నారు. బేగంపేటలోని ఇంటర్ గ్రాఫ్ సంస్థ హైదరాబాద్‌లో ఫస్ట్ ఐటీ భవనమని చెప్పారు. అప్పటి నుంచి 2014 వరకు అంటే 27 ఏళ్లలో ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్లు అని తెలిపారు. కానీ గత ఏడాది ఐటీ రంగంలో రూ.57,707 కోట్ల ఎగుమతులు సాధించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తద్వారా గత 27 ఏళ్లలో చేసిన పనులను కేవలం ఒకే ఏడాదిలో చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వానకే ఈ ఘనత దక్కిందని అన్నారు. దక్షత, సమర్ధత కలిగిన ప్రభుత్వాలు ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని తెలిపారు. దేశంలో సృష్టించిన మొత్తం టెక్నాలజీ ఉద్యోగాల్లో 44 శాతం ఉద్యోగాలు తెలంగాణ నుంచే ఉన్నాయని శాసనసభలో కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న మరికొన్ని నగరాలకూ ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని అన్నారు. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలి.. తాము ఈ విషయంలో ముందున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.