హైదరా‌‌బాద్‌లోని ప్ర‌జ‌ల‌కు రెండు రోజుల ముందే సంక్రాంతి : కేటీఆర్‌

Minister KTR inaugurates free water scheme.హైద‌రాబాద్‌లో సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందే వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2021 8:28 AM GMT
free water scheme

హైద‌రాబాద్‌లో సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందే వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంద‌ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌ల సంతోషం చూస్తూనే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో జల మండలి ముందు నీటి కోసం ఆందోళనలు చూశామ‌ని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. హైదరాబాద్‌లోని 9 లక్షల కుటుంబలకు ఉచితంగా తాగునీరు ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఇవాళ ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని ప్రారంభించుకున్నామ‌ని పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లులు ఇచ్చామ‌ని చెప్పారు. డిసెంబ‌ర్ న‌ల్లా బిల్లు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదన్నారు. ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌లో దోబీఘాట్ క‌ట్టిస్తామ‌న్నారు. 2048 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో తాగునీటి క‌ష్టాలు లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. 9,714 కోట్ల‌తో ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించామ‌ని.. త్వరలో పంపిణీ చేస్తామని ప్రకటించారు.


ఎన్నికలు వచ్చిన్నప్పడు చాలా మంది చాలా మాట‌లు చెబుతారని.. కానీ సీఎం కేసీఆర్ నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని డిసెంబర్‌లో అన్నారు. ఆ మాటను ఇవాళ కేసీఆర్ నిలబెట్టుకున్నారని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపిన కేటీఆర్.. కరెంటు, మంచి నీటి బాధ పోయిందని ప్రకటించారు. కరోనా సంక్షోభంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని.. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పేదలకు స్వర్ణ యుగంగా అభివ‌ర్ణించారు.

కుల‌మ‌తాల‌కు అతీతంగా పేద‌లంతా అభివృద్ధి చెందాల‌న్న‌దే టీఆర్ఎస్ ధ్యేయ‌మ‌ని తేల్చిచెప్పారు. బ‌స్తీల్లోని పేద‌ల కోసం అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామ‌న్నారు. బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌ను విదేశాల‌కు పంపి చ‌దివిస్తున్నామ‌ని గుర్తు చేశారు. రాష్ర్టంలోని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.


Next Story