మ‌హిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. 'ఉద్యామిక' తో అవ‌కాశాలు

Minister KTR inaugurated Industrial Park in Sultanpur.రాష్ట్రంలోని మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 10:34 AM GMT
మ‌హిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. ఉద్యామిక తో అవ‌కాశాలు

రాష్ట్రంలోని మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి రాయితీ ఇస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మ‌హిళ‌లు.. పారిశ్రామిక వేత్త‌లుగా ఎద‌గ‌డానికి స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు చెప్పారు. అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50 ఎక‌రాల్లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మ‌హిళా పారిశ్రామిక పార్కును గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంత‌రం పార్కు పైలాన్‌ను ఆవిష్క‌రించి మాట్లాడారు.

మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హ‌బ్ మాత్ర‌మేన‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటైన వీ హ‌బ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీ హ‌బ్ సంద‌ర్శించి మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలని సూచించారు. వీ హ‌బ్ ఇప్ప‌టికే 2,194 స్టార్ట‌ప్‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేసిందని, ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయించిన‌ట్లు చెప్పారు. స్టార్ట‌ప్ నిధుల‌తో 2,800 మందికి ఉపాధి క‌ల్ప‌న సృష్టించిన‌ట్లు తెలిపారు.

ఇక‌.. దేశంలో తొలిసారి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం 'ఉద్యామిక' అనే కొత్త కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు. దీని ద్వారా మ‌హిళాపారిశ్రామిక వేత్త‌ల ఫిర్యాదుల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది. ఉద్యామిక‌లో సంప్ర‌దింపుల క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ క‌మిటీ ద్వారా ప్రాసెస్‌, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహ‌కాలు అందుతాయని చెప్పారు. సుల‌భ‌త‌ర వాణిజ్యానికి కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు కావాల‌న్నారు. ప్ర‌పంచ స్థాయి ఉత్ప‌త్తుల‌తో పురోభివృద్ధి సాధించాల‌ని ఆశిస్తున్నాను అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు ఉజ్వల సింఘానియా, ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చైర్‌పర్సన్ ఉమా చిగురుపాటి తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it