రఘునందన్ రావును ఇంటికి పంపిస్తున్నాం: కేటీఆర్
దుబ్బాకలో ఈసారి తప్పకుండా గెలవబోతున్నామని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు.
By Medi Samrat Published on 21 Nov 2023 5:45 PM ISTదుబ్బాకలో ఈసారి తప్పకుండా గెలవబోతున్నామని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసారి ఇంటి బాట పట్టడం ఖాయమని కేటీఆర్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో జరిగిన పార్టీ యువజన గర్జనలో ఈ వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రఘునందన్ రావు గెలవకముందు ఎన్నో మాటలు చెప్పారని, హామీలు ఇచ్చారని, కానీ వేటినీ నెరవేర్చలేదన్నారు. ఉప ఎన్నికల సమయంలో చెప్పిన మాటలే ఇప్పుడు కూడా చెబుతున్నారని అన్నారు. బీజేపీ నుంచి మీ వద్ద ఓ ఒర్రుబోతు ఉన్నారని రఘునందరావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మాటలు తప్ప చేతలు లేవన్నారు.
ఎన్నికల తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామని అన్నారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు ఇరవై నాలుగు గంటల కరెంట్ చూపించమని సవాల్ చేస్తున్నారని, ఇక్కడ దుబ్బాకకు వచ్చి ఓసారి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందన్నారు. యాభై ఏళ్ళుగా ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడగడానికి సిగ్గుండాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయన్నారు. ఎన్నికల అనంతరం పద్దెనిమిదేళ్లు నిండిన ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, ఆసరా పెన్షన్‌ను రూ.5వేలకు పెంచుతామని, రైతుబంధును క్రమంగా రూ.16వేలకు తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.