కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ కట్టిన పన్నుల సొమ్ముతో కేంద్రం కులుకుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ నిధులను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుని అభివృద్ధి చెందని బీజేపీ రాష్ట్రాలను అభివృద్ధి చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి 3.68 లక్షల కోట్లు పన్నులు చెల్లించిందని, అయితే రాష్ట్రానికి 1.68 లక్షల కోట్లు మాత్రమే పంపిణీ చేసిందని కేటీఆర్ అన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సహా తెలంగాణ బీజేపీ ఎంపీలు తన వాదన తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్ వారికి సవాల్ విసిరారు. తమ వాదనలకు బలం చేకూర్చలేకపోతే పదవులు వదులుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయని అసమర్థుడు కిషన్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. ఉద్యమంలో కూడా పాల్గొనని కిషన్ రెడ్డి కనీసం క్షమాపణలు చెప్పి ధన్యవాదాలు చెప్పాలంటూ సూచించారు కేటీఆర్.
బీజేపీ ప్రమాదకరమైందని.. దాని ఉచ్చులో పడొద్దని యువతకు కేటీఆర్ సూచించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని అంటూ ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి మాట్లాడేవన్ని అబద్ధాలేనన్న కేటీఆర్.. ఆయనను నిలదీస్తే ఒక్క సమాధానం కూడా చెప్పరని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయి, ప్రజలు మాత్రం మరింత అగాధంలోకి వెళ్లారన్నారు. ప్రధాని మోదీ వల్ల దేశంలో అప్పులు పెరిగాయన్నారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.