రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్.. ఆరోజు ప్రజలెవరు ప్రయాణాలు పెట్టుకోవద్దు
Minister KTR another challenge to Revanth Reddy.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2021 11:42 AM ISTటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ ఉదయం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి ఈటల కోసమే కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని అక్కడ నిలబెట్టిందన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చిలక జోస్యం చెప్పుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని తెలిపారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రచారం ఇంకా ఖరారు కాలేదన్నారు.
ఉప ఎన్నికలో జానారెడ్డినే ఓడించామని, ఈటల రాజేందర్ అంతకంటే పెద్ద నాయకుడా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ బురదను ఈటల అంటించుకున్నారన్నారు. కొంతకాలం తరువాత ఈటలను కాంగ్రెస్‌లో కి ఆహ్వానిస్తారని.. వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తోందన్నారు.కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క ఒక్కరే మంచి వ్యక్తి. కానీ కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని.. గట్టి అక్రమార్కులదే నడుస్తోందన్నారు. ఇక తెలంగాణ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు.
కేసీఆర్ విజనరీ నేత అని.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 10 నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు. ఇక నవంబర్ 15న ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. ఆ రోజున వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటామన్నారు. 20 రోజుల్లో రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.