ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వం: మంత్రి కేటీఆర్

చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని పంచాయితీలను అక్కడే చూసుకోవాలని అన్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Sept 2023 4:32 PM IST
Minister KTR,  chandrababu arrest, Telangana,

ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వం: మంత్రి కేటీఆర్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో.. మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడి పంచాయితీలను అక్కడే చూసుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ ఏపీలోని రెండు రాజకీయ పార్టీ మద్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు కేటీఆర్. అయితే.. ఈ విషయంపై బీఆర్ఎస్‌ నాయకులు స్పందిస్తే వారి వ్యక్తిగతం అని చెప్పారు. వారి వాఖ్యలతో పార్టీ అధిష్టానానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు కేటీఆర్. చంద్రబాబు అరెస్ట్‌ అయ్యింది ఆంధ్రప్రదేశ్‌లోనే అని అన్నారు. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు తెలంగాణలో నిర్వహిస్తామనడం సరికాదని చెప్పారు కేటీఆర్. ఇక్కడ రాద్దాంతం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇవాళ ఒకరు ర్యాలీ చేస్తే.. రేపు మరొకరు చస్తారని అన్నారు. పక్కింటి పంచాయితీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. విజయవాడలో, అమరావతిలో, రాజమండ్రిలో ర్యాలీలు చేసుకోండని.. ఒకరితో ఒకరు తలపడండి.. ఎవరూ ఆపరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్న సమస్యపై పరిష్కారం కోసం తెలంగాణలో కొట్లాడతామంటే ఎలా అని నిలదీశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఉందని.. ఇక్కడ శాంతిభద్రతల సమస్య వస్తే ఊరుకోబోమని చెప్పారు. అందుకే తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీలు, ఆందోళనలు చేస్తామనడం సరికాదని అన్నారు. ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వలేమని చెప్పారు. ఏపీ రాజకీయల గొడవలకు హైదరాబాద్‌ను వేదిక కానివ్వమని చెప్పారు. తెలంగాణలో టీడీపీ, వైసీపీ ఉనికే లేదని అన్నారు.

తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉన్నారని.. దయచేసి శాంతిభద్రతలను చెడగొట్టొద్దని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఊటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదనన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో తాము తటస్థంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని.. ఆయనకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

అలాగే బీజేపీ నాయకులపైనా మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని అన్నారు. పదేపదే పార్లమెంట్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కుతున్నారని అన్నారు. తెలంగాణపై ఏమాత్రం ప్రేమలేని వ్యక్తి ప్రధాని మోదీ అని.. అలాంటి వ్యక్తి తెలంగాణలో పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల శాపం బీజేపీకి తగులుతుందని.. రాష్ట్రంలో జరగబోయే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా పోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story