మహిళా మంత్రిని అని చూడకుండా దారుణ పోస్టులు పెట్టారు: కొండా సురేఖ
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 12:21 PM GMTతెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో కొందరు కావాలనే దారుణమైన పోస్టులు పెట్టారని అన్నారు. మహిళా మంత్రిని అని కూడా చూడకుండా అవమానపరిచేలా పోస్టులు పెట్టడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రేణులు ఇలాంటి పోస్టులు పెట్టారని మండిపడ్డారు కొండా సురేఖ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయిన బాధలో ఉన్నారని.. దాంతో వారేం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కవిత పంట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్ధిస్తారా అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. డబ్బులిచ్చి మహిళలపై ట్రోల్ చేయించడం సరికాదని మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు.
ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారనీ.. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా? అంటూ ప్రశ్నించారు. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా? అన్నారు. రెండవరసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌లో భారీ మార్పులు వచ్చాయనీ... బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదం ఎక్కి పిచ్చిగా ప్రవర్తించారని కొండా సురేఖ అన్నారు. ఇక కేటీఆర్ మొదటి నుంచి మహిళలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే.. బస్సుల్లో డిస్కో డ్యాన్స్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తే ఊరుకుంటాం కానీ.. మహిళను వ్యక్తిగతంగా అవమానిస్తూ మాత్రం ఊరుకోము అని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.