తెలంగాణలో కొత్తరకం బీర్లపై స్పందించిన మంత్రి జూపల్లి
తాను చేసిన వ్యాఖ్యలకూ కట్టుబడి ఉన్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు.
By Srikanth Gundamalla Published on 29 May 2024 7:29 AM ISTతెలంగాణలో కొత్తరకం బీర్లపై స్పందించిన మంత్రి జూపల్లి
తెలంగాణలోకి కొత్త రకం బీర్లు వస్తున్నాయిని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా దీన్ని కన్ఫామ్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణలోకి ఈ కంపెనీకి చెందిన కొత్తరకం మద్యం వస్తోందని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం స్పందించారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెంనీ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి జూపల్లి చెప్పారు.
కాగా.. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి ధరఖాస్తులు రాలేదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకూ కట్టుబడి ఉన్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. తన వద్దకు ఏ ఫైలూ రాలేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేష్‌కు ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతి లభించిందన్నారు. ఇక బేవరేజెస్ కార్పొరేషన్ రోజూవారీ కార్యకలాపాలు తన దృష్టికి రాలేదనీ.. అందుకే ఆ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు మంత్రి జూపల్లి.
అయితే.. కొందరు ఈ విషయం తెలియక తనపై దుష్ప్రచారం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. డిమాండ్-సప్లయిని బట్టి కొత్త కంపెనీలకు బేవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని ఈ మేరకు చెప్పారు. సోమ్ డిస్టిలిరీస్ 20 ఏళ్లుగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా చేస్తోందని జూపల్లి చెప్పారు. ఎక్కడా ఈ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. వారి హయాంలో కూడా కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. బేవరేజెస్ కార్పొరేషన్ గతంలో ఎలాగైతే అనుమతులు ఇచ్చిందో ఇప్పుడే అవే నిబంధనలు పాటించిందని చెప్పారు. ఎక్కడా ఎలాంటి తప్పిదమూ జరగలేదని ఈ మేరకు మంత్రి జూపల్లి క్లారిటీగా చెప్పారు.