Minister Harish Rao : మాతా, శిశు మరణాలను తగ్గించేందుకే.. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
మాతా శిశు మరణాలను తగ్గించేందుకే ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 8:30 AM GMTమంత్రి హరీశ్‌రావు
మాతా శిశు మరణాలను తగ్గించేందుకే ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రాంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఎర్రమంజిల్‌లో నిర్మించే 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో మూడు ఎంసీహెచ్ హాస్పిటల్స్ మాత్రమే ఉండేవని ప్రస్తుతం వాటి సంఖ్య 27కి చేరిందన్నారు. ఆస్పత్రుల సంఖ్య పెరగడం వల్ల గొప్ప ఫలితాలు వచ్చాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గాయన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92 మరణాలు ఉంటే.. దాన్ని 43కు తగ్గించగలిగామని, ప్రతి లక్షకు శిశు మరణాలు 36 ఉంటే 21కి తగ్గించుకున్నట్లు చెప్పారు.
Speaking after Laying Foundation Stone to 200 Bedded MCH Hospital at Erramanzil https://t.co/gnEAkpxEu1
— Harish Rao Thanneeru (@BRSHarish) March 28, 2023
మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. తొలి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఎంసీహెచ్ ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 499 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
గాంధీలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ, నిమ్స్‌లో 200 పడకలు, అల్వాల్‌లో కూడా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఎంసీహెచ్ ఆస్పత్రిని రూ. 55 కోట్లతో 4 అంతస్తుల్లో 200 పడకలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.