డ్రైనేజీ కాలువలో చెత్తను తీసేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట మున్సిపాలిటీలోని 18వ వార్డులో రోడ్ల వెంట తిరుగుతూ చెత్త సేకరణ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు పాల్గొని ఆదర్శంగా నిలిచారు.

By అంజి  Published on  24 July 2023 5:36 AM GMT
Minister Harish Rao, garbage collection drive , Siddipet

డ్రైనేజీ కాలువలో చెత్తను తీసేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట మున్సిపాలిటీలోని 18వ వార్డులో రోడ్ల వెంట తిరుగుతూ చెత్త సేకరణ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు పాల్గొని ఆదర్శంగా నిలిచారు. పక్షం రోజుల క్రితం మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులకు తమ వార్డుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించిన హరీశ్‌ రావు.. సోమవారం ఉదయం చెత్తను సేకరించేందుకు పారిశుధ్య కార్మికుని పాత్రను పోషించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ ప్రజలతో కలిసి డ్రైనేజీలో కూరుకుపోయిన చెత్తను తొలగించారు. చెత్తను సేకరించడం, మూసుకుపోయిన డ్రైన్‌లను క్లియర్ చేయడంతో పాటు, మంత్రి పౌరులతో ఇంటరాక్ట్ అయ్యి.. చెత్తను తడి, పొడి చెత్తగా విభజించాల్సిన అవసరం గురించి వారికి అవగాహన కల్పించారు.

దోమలు పెరగకుండా ఉండేదుకు, నీరు నిలువకుండా పొడిగా ఉండేలా చూడాలని మంత్రి ప్రజలను కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్న మంత్రి.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని, చెత్త డబ్బాలను ఉపయోగించాలని పౌరులను కోరారు. నిరంతరం కృషి, ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేటను చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. ''నడుస్తూ చెత్తను ఏరుదాం.. వేరుచేద్దాం.. చెత్తను తొలగిద్దాం. నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు భాగస్వామ్యం కావాలి. చెత్త కుండి లేని సిద్దిపేట గా మారుద్దాం.. స్వచ్చ సిద్దిపేట, శుద్దిపేటగా చేసుకుందాం.'' అంటూ మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.

Next Story