సిద్దిపేట: క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకునేందుకు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి టీబీ రోగికి ఆరు నెలలకోసారి పోషకాహార కిట్‌ను తన సొంత ఖర్చుతో అందజేయాలని ఆర్థిక , ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు నిర్ణయించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 265 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, 30 గుడ్లు, ఒక కిలో పప్పు, మూడు కిలోల బియ్యం, 300 గ్రాముల ఆవు నెయ్యితో కూడిన కిట్‌ను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. ఈ కిట్‌కు ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి పేరును టీహెచ్‌ఆర్ (తన్నీరు హరీశ్ రావు) న్యూట్రిషన్ కిట్‌గా పెట్టారు. ప్రతి రోగికి కనీసం ఆరు నెలల పాటు కిట్‌ను పంపిణీ చేస్తారు.
చాలా మంది క్షయవ్యాధిగ్రస్తులు ఆర్థిక నేపథ్యం లేని వారే కావడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై వారికి అవగాహన లేకపోవడంతో వారు వ్యాధి నుంచి త్వరగా కోలుకునేలా పౌష్టికాహార కిట్‌ను సరఫరా చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ సమయంలో రోగులు పనికి వెళ్లలేని కారణంగా, వారు త్వరగా కోలుకోవడానికి సహాయపడే పౌష్టికాహారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారని ఆరోగ్య మంత్రి తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ కిట్ ఆసరా రోగుల మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని హరీశ్ రావు అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 902 మంది టీబీ రోగులు ఉన్నారు. తమ పట్ల శ్రద్ధ చూపుతున్న మంత్రికి టిబి రోగులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.