మీకు తెలంగాణ రైతుల ఓట్లు కావాలి కానీ.. వారి వడ్లు వద్దా?
Minister Harish Rao Fires on Union Minister Piyush Goyal.కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 7:37 AM GMTకేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆయన ఓ కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ నేతగా మాట్లాడారని ఆక్షేపించారు. ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 70లక్షల మంది రైతుల తరుపున మంత్రులు ఢిల్లీకి వెళ్లారని.. వారిని కేంద్రమంత్రి 'మీకేం పని లేదా?' అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు.
ఈ వ్యాఖ్యలు 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. వెంటనే పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల కోసమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ జాతి, ప్రయోజనాల కోసం అనేక త్యాగాల పునాదుల మీద రాష్ట్రాన్ని సాధించామని తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కంటే ఇకేం ముఖ్యం కాదన్నారు.
70 లక్షల రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని, ఇదే సమయంలో బీజేపీ నేతలకు మాత్రం ఎలా సమయం ఇచ్చారని ఆక్రోశించారు. తమ గురించి ఇంత దారుణంగా మాట్లాడే నైతికత మీకెక్కడిదని హరీశ్ ప్రశ్నించారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని నిలదీశారు. మీకు తెలంగాణ రైతుల ఓట్లు కావాలి కానీ.. వారి వడ్లు వద్దా? అని ప్రశ్నించారు.
పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. నిన్నగాక మొన్న బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారని, రేపు రా రైస్ కూడా కొనమని చెతులెత్తేస్తే మా రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. ఓ వైపు రైతుల కళ్లాల వద్ద పడిగాపులు పడుతున్నారని.. మీరిచ్చిన 40లక్షల మెట్రిక్ టన్నుల కోటా పూర్తయ్యిందని.. ఆ తర్వాత కొంటరా కొనరా? అని అడిగేందుకు రైతుల బృందం ఢిల్లీకి వచ్చారన్నారు.
ఇక ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని చెప్పారు. గతంలో కరువు వస్తే మెడ మీద కత్తి పెట్టి ధాన్యం సేకరించలేదా..? కేంద్రానికి చేతగాకపోతే ధాన్యం ఎగుమతి, దిగుమతి అంశాన్ని రాష్ట్రాకు ఇవ్వాలన్నారు. అనవసరంగా బురద చల్లే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు.