ప్రభాకర్‌రెడ్డికి కత్తి లోతుగా దిగలేదు.. సర్జరీ జరుగుతోంది: హరీశ్‌రావు

దుబ్బాక బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి హరీశ్‌రావు.

By Srikanth Gundamalla  Published on  30 Oct 2023 12:04 PM GMT
minister harish rao, consultation, kotha prabhakar reddy, brs ,

ప్రభాకర్‌రెడ్డికి కత్తి లోతుగా దిగలేదు.. సర్జరీ జరుగుతోంది: హరీశ్‌రావు

దుబ్బాక బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి హరీశ్‌రావు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఆస్పత్రిలో పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి హరీశ్‌రావు.. కారు దిగ్గానే పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి వెపు వెళ్లారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎలా ఉందో అన్న ఆందోళనతో పరుగులు తీశారు. ఆయన వెంటనే పార్టీ మిగతా ప్రతినిధులు కూడా పరిగెత్తారు.

బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై దాడి గర్హనీయం అని చెప్పారు మంత్రి హరీశ్‌రావు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది అని చెప్పారు. సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఈ దాడి జరిగిందన్నారు. రాజు అనే వ్యక్తి కత్తితో దాడిచేశాడని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభాకర్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు హరీశ్‌రావు చెప్పారు. అయితే.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సర్జరీ చేస్తున్నారని.. ఎంత మేరకు ప్రమాదం ఉందో వైద్యులు త్వరలోనే చెబుతారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎవరికీ కీడు చేయని వ్యక్తి అని హరీశ్‌రావు అన్నారు. అలాంటి వ్యక్తిపై ఎలా దాడి చేయాలని అనిపించిందంటూ ప్రశ్నించారు. అయితే.. కత్తి లోపలికి ఎక్కువగా దిగకపోవడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. ప్రత్యర్థులు రాజకీయంగా ఎదుర్కోవాలి.. కానీ ఇలా దాడులకు తెగబడటం సరికాదంటూ హరీశ్‌రావు హెచ్చరించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని.. అధైర్య పడొద్దని అన్నారు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అయితే.. ఈ హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Next Story