పి. చిదంబరానికి మంత్రి హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు వేడెక్కుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 11:30 AM GMT
minister harish rao, brs, telangana elections,  chidambaram,

పి. చిదంబరానికి మంత్రి హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు వేడెక్కుతున్నాయి. పలువురు జాతీయ నేతలు ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. చిదంబరం వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక పోస్టు పెట్టారు.

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం.. దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అపుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ కాదా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారనీ, చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదు చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారంటూ హరీశ్‌ రావు మండిపడ్డారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే సంగతిని మర్చి, అప్ప‌ట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు మంత్రి హరీశ్‌రావు.

తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహించాలని సూచించారు. అలాగే తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికల్ని పరిశీలిస్తే మంచిదని కూడా అన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని పేర్కొన్నారు మంత్రి హరీశ్‌రావు.

ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారనీ... చిదంబరంకు దమ్ముంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ సాధించింది కేసీఆర్... సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే దీవించబోతున్నారు అంటూ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Next Story