బెడ్స్ కొరత లేదు.. అందుకే కేసులు పెరుగుతున్నాయ్ : మంత్రి ఈటల
Minister Etala Rajender Press meet.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం బీర్కే భవన్‌లో
By తోట వంశీ కుమార్ Published on 18 April 2021 1:22 PM IST
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పేషంట్స్‌కు చికిత్స నందించే ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ కొరత లేదన్నారు. ఇప్పటి వరకు ఐదు ఆస్పత్రుల్లోనే బెడ్లు నిండిపోయాయని.. రాష్ట్రంలో 60 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్ మొదలైందన్నారు. వైరస్ బాధితుల్లో లక్షణాలు కనిపించడం లేదన్నారు. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 4 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని అయితే.. ప్రస్తుతం చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. ఈ కారణంగా కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తోందని చెప్పారు.
తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉందన్నారు. అయితే.. టీకాలు అందుబాటులో లేక ఈ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ రోజు రాత్రికి 2.7 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లామని.. టీకా నిల్వలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని.. రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ 300 నుంచి 350 టన్నుల వరకు అవసరమయ్యే ఆస్కారముందన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవని చెప్పారు.