బీఆర్ఎస్ కండువాతో వెళ్లి ఓటేసిన మంత్రి అల్లోల, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
By అంజి Published on 30 Nov 2023 7:00 AM GMTబీఆర్ఎస్ కండువాతో వెళ్లి ఓటేసిన మంత్రి అల్లోల, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పలు చోట్ల మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బెల్లంపల్లి అభ్యర్థి దుర్గం చిన్నయ్య మెడలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకొని వెళ్లి ఓటు వేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడం వివాదాస్పదమైంది.
ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం.. పోలింగ్ బూత్ లోకి పార్టీ చిహ్నాలను కానీ, వాటిని పోలిన వస్తువులు, గుర్తులను కానీ తీసుకువెళ్లకూడదు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తారు. ఎవరైనా తెలిసి లేదా తెలియకుండా పార్టీ గుర్తులను కానీ వస్తువులను కానీ వెంట తీసుకువస్తే పోలీసులు వారిని అడ్డుకుంటారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా మెడలో గులాబీ కండువాతో వెళ్లి ఓటు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బెల్లంపల్లిలో అధికార పార్టీ తరఫున పోటీలో ఉన్న దుర్గం చిన్నయ్య కూడా ఇదే రీతిలో వ్యవహరించి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు.
జెండావెంకటాపూర్ లో దుర్గం చిన్నయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేశారు. గులాబీ కండువాతో లోపలికి వెళ్లడం, ఓటేయడం మీడియా కెమెరాలకు చిక్కింది. ఇలా దుర్గం చిన్నయ్య వ్యహరించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని ప్రతిపక్షాల అభ్యర్థులు మండిపడుతున్నారు. కాగా ఈ కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో 8.52% పోలింగ్ నమోదు కాగా, 11.00 గంటల వరకు 20.64% నమోదైనట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విటర్ వేదికగా తెలిపింది. ఎన్నికల కమిషన్ రూపొందించిన 'ఓటర్ టర్నవుట్' యాప్‌లో ఈ ఓటింగ్ శాతం నమోదైనట్లుగా చెప్తూ, ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.