తెలంగాణలో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుంది: అక్బరుద్దీన్ ఒవైసీ

MIM to contest on 50 seats in next Assembly polls.. Akbaruddin Owaisi. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 50 స్థానాల్లో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని

By అంజి  Published on  5 Feb 2023 4:56 AM GMT
తెలంగాణలో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుంది: అక్బరుద్దీన్ ఒవైసీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 50 స్థానాల్లో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఏఐఎంఐఎం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ''రాబోయే ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టడంపై పార్టీ అధ్యక్షుడితో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో ఏఐఎంఐఎం యాభై స్థానాల్లో పోటీ చేస్తుంది. శాసనసభ్యుల సంఖ్యను ఏడు నుండి పదిహేనుకు రెట్టింపు చేస్తాం'' అని అన్నారు. వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఎంటో చూపిస్తామన్నారు.

కాగా మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఎమ్‌ఐఎమ్‌ ఎమ్మెల్యే ప్రకటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సభలో ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఎంఐఎం శాసనసభ్యులకు మరింత సమయం ఇవ్వాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ అసెంబ్లీ స్పీకర్‌ను అభ్యర్థించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న వారికి గంటసేపు కేటాయిస్తే తమకు ఎంత సమయం కేటాయిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్, అక్బరుద్దీన్ ఒవైసీల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ వాదించారు. ఉర్ధూ రెండో భాష అయినా అన్యాయమే జరుగుతోందని అన్నారు. చారిత్రాత్మకమైన చార్మినార్ పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేశారు.

Next Story