తెలంగాణలో పెరుగుతున్న డిప్రెషన్ కేసులు.. ప్రతి 9 నిమిషాలకో 'టెలి-మానస్' కాల్!
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు మానసిక ఆరోగ్య సాయం కోసం ఫోన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్...
By - అంజి |
తెలంగాణలో పెరుగుతున్న డిప్రెషన్ కేసులు.. ప్రతి 9 నిమిషాలకో 'టెలి-మానస్' కాల్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు మానసిక ఆరోగ్య సాయం కోసం ఫోన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (IMH) పరిధిలో పనిచేస్తున్న 'టెలి-మానస్' (Tele-MANAS) కేంద్రానికి అందుతున్న కాల్స్ డేటాను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. అక్టోబర్ 2022లో ప్రారంభమైన ఈ హెల్ప్‌లైన్, ఫిబ్రవరి 2026 నాటికి సుమారు 1,94,237 కాల్స్‌ను స్వీకరించింది. పండగలు, వారాంతాలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండటం గమనార్హం.
కామారెడ్డి జిల్లా టాప్.. మహిళల నుంచే అధికం:
చిత్రమైన విషయమేమిటంటే, రాజధాని హైదరాబాద్ (9,904) కంటే కామారెడ్డి జిల్లా (19,366) నుంచే అత్యధిక కాల్స్ రావడం. ఆ తర్వాత హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాల్స్ చేస్తున్న వారిలో 67 శాతం మహిళలు ఉండగా, 33 శాతం పురుషులు ఉన్నారు. ముఖ్యంగా 18 నుండి 45 ఏళ్ల వయస్సు గల యువత (53%) ఎక్కువగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైద్యపరమైన సందేహాలు, మానసిక ఒత్తిడి, తీవ్రమైన విచారం, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలపై కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి.
సిబ్బంది కొరత ఉన్నా ఆగని సేవలు:
టెలి-మానస్ కేంద్రంలో 31 పోస్టులకు గానూ ప్రస్తుతం 22 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, రోజుకు సగటున 150 నుండి 200 కాల్స్‌ను వీరు డీల్ చేస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు లేదా గృహ హింసకు గురవుతున్నప్పుడు బాధితులకు తిరిగి కాల్ చేసి (Call-back policy) కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతిని ఇక్కడ పాటిస్తున్నారు. ఇతర రాష్ట్రాలైన బీహార్, హర్యానాల్లో సిబ్బంది నియామకం సున్నాగా ఉన్న తరుణంలో, తెలంగాణ 71 శాతం సామర్థ్యంతో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.
అవగాహన పెంచే దిశగా అడుగులు:
కేవలం ఫోన్ లైన్లకే పరిమితం కాకుండా, ప్రభుత్వం 547 కళాశాలలు, 942 పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించింది. ఆశా (ASHA) కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా గ్రామస్థాయిలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నిరంతర ప్రచారం వల్లే ములుగు, ఆసిఫాబాద్ వంటి మారుమూల జిల్లాల నుండి కూడా కాల్స్ వస్తున్నాయి. సామాజికంగా ఉండే చిన్నచూపు (Stigma) కారణంగా ఆసుపత్రికి వెళ్లడానికి భయపడే వారికి 14416 టోల్ ఫ్రీ నంబర్ ఒక వరంలా మారింది. 2026 సంవత్సరం ముగిసేలోపు ఈ కాల్స్ సంఖ్య రెండు లక్షల మార్కును దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.