ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలే ఉన్నాయి: చిరంజీవి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 1:49 PM ISTప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలే ఉన్నాయి: చిరంజీవి
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. పద్మ అవార్డుల గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మానం సభ ఏర్పాటు చేసింది. ఈ మేరకు పద్మ అవార్డులను సొంతం చేసుకున్న వారందరినీ ప్రభుత్వం సన్మానించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరిగింది.
పద్మ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయాల గురించి కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. పద్మభూషన్ అవార్డు వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు లేదని అన్నారు. కానీ.. తర్వాత ఎంతో మంది ప్రతి రోజు వచ్చి కలిసి శుభాకాంక్షలు తెలపడం.. ఆశీర్వచనాలు ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మ విభూషన్ అవార్డులు ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉందనీ.. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోదీదే అని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా అభినందించాల్సిందే అని వ్యాఖ్యానించారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని చిరంజీవి అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తాను పెద్ద అభిమానిని అని చెప్పారు చిరంజీవి. ఆయన మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తాయన్నారు. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడైనా హుందాతనం ఉండాలని చెప్పారు. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విమర్శలు తగవని చెప్పార. కానీ.. ప్రస్తుతం రాజకీయాలు మొత్తం వ్యక్తిగత విమర్శలతోనే నడుస్తున్నాయని అన్నారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను కూడా రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చానన్నారు. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలను చేసే వారిని తిప్పికొట్టే విధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతామనే పరిస్థితి ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.