నర్సంపేటలో వైద్య నిర్లక్ష్యం.. మైనర్ బాలిక కడుపునొప్పితో వెళ్తే గర్భవతి అని రిపోర్ట్!
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఒక స్కానింగ్ సెంటర్‌లో జరిగిన పొరపాటు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
By - అంజి |
నర్సంపేటలో వైద్య నిర్లక్ష్యం.. మైనర్ బాలిక కడుపునొప్పితో వెళ్తే గర్భవతి అని రిపోర్ట్!
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఒక స్కానింగ్ సెంటర్‌లో జరిగిన పొరపాటు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కడుపునొప్పితో బాధపడుతున్న ఒక మైనర్ బాలికకు తప్పుడు రిపోర్టు ఇచ్చి, ఆమె గర్భవతి అని నిర్ధారించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు సదరు సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కడుపునొప్పి రావడంతో బాలికను స్థానిక స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు.
అక్కడి సిబ్బంది పరీక్షలు నిర్వహించి, ఆమె గర్భం దాల్చినట్లు రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టు చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు, అనుమానంతో వరంగల్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో మళ్లీ పరీక్షలు చేయించారు. అక్కడ నిర్వహించిన లోతైన పరీక్షల్లో ఆ బాలిక గర్భవతి కాదని, కేవలం గర్భాశయంలో చిన్న కణితి (Tissue growth) ఉందని తేలింది. వైద్యులు వెంటనే చిన్న శస్త్రచికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. నిజం తెలిసిన తర్వాత, బాలిక కుటుంబ సభ్యులు నర్సంపేటలోని మొదటి స్కానింగ్ సెంటర్ సిబ్బందిని నిలదీశారు.
వైద్య నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డకు, కుటుంబానికి తీవ్ర మానసిక క్షోభ మిగిల్చారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఇరుపక్షాలు ఫిర్యాదు చేసుకోగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి తప్పుడు నిర్ధారణల వల్ల సామాజికంగా, మానసికమైన ఇబ్బందులు ఎదురవుతాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది.