ఇవాళ్టి నుంచి మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు

మేడారంలో జరిగే సమ్మక్క సారాలమ్మ మహాజాతరలో ప్రత్యేక పూజలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.

By Srikanth Gundamalla  Published on  14 Feb 2024 6:38 AM IST
medaram, sammakka, saralamma, jatara, telangana,

 ఇవాళ్టి నుంచి మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు 

మేడారంలో జరిగే సమ్మక్క సారాలమ్మ మహాజాతరలో ప్రత్యేక పూజలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఘనంగా జరిగే ఈ మహాజాతర కోసం భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర ప్రాంతాల నుంచికూడా తరలి వస్తారు. అయితే.. భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఎక్కడా కూడా వారికి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సిబ్బందిని నియమించింది.

ఇక మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు కొనసాగనుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతాయి.

పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడ్డాయి. దాంతో పూజారులు అడవికి వెళ్లి చెట్ల కొమ్మలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించారు. ఆ తర్వాత వైభవంగా పండుగను చేశారు. దీనినే మండమెలిగ పండుగ అని పిలుస్తున్నారు. పూజారులంతా ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు. బుధవారం ప్రారంభయ్యే ఈ వేడుక ఇలా గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగనుంది.

Next Story