Telangana: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతర సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 10:53 AM GMTTelangana: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతర సందడి కొనసాగుతోంది. సామ్మక్క, సారాలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను భక్తులు అస్సలు మిస్ అవ్వరు. అయితే.. మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు తెలంగాణ అటవీశాఖ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. మేడారం జాతర ముగిసేవరకు పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మేడారం సమ్మక్క సారక్కలను వనదేవతలుగా భక్తులు ఆపద కాపలాగా పూజిస్తారు. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. అయితే.. అటవీశాఖ భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ సూచన మేరకు అధికారులు ప్రకటన చేశారు. ఈ జాతర ముగిసే వరకు పర్యావరణ రుసుముని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుములను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇక రాష్ట్ర అటవీశాఖ నిర్ణయంతో మేడారం జాతరకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయి. అలాగే రద్దీ నియంత్రణ కూడా కొంత మేర సులువు అవ్వనుంది. ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని పస్రా, తాడ్వాయి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల నుంచి అధికారులు నామమాత్రపు పర్యావరణ రుసుము వసూలు చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో అటవీశాఖ ప్లాస్టిక్‌ను తొలగించేందుకు, వణ్యప్రాణుల రక్షణ చర్యలకు వినియోగిస్తోంది. ఇప్పుడు పలు వర్గాలు విజ్ఞప్తి చేయడం ద్వారా అటవీశాఖ ఈ రుసుమును వసూలు చేయడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి యథావిధిగా రుసుము వసూలు చేస్తారు.