మేడారం అడవుల్లో 50వేల చెట్లు ధ్వంసమైన ఘటన.. జంతువులు విపత్తును పసిగట్టాయా?
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఇటీవల వేల చెట్లు నేలకొరిగాయి.
By Srikanth Gundamalla Published on 18 Sep 2024 9:13 AM GMTములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఇటీవల వేల చెట్లు నేలకొరిగాయి. ఎన్నో ఏళ్లనాటి చెట్లు కూడా కూకటి వేళ్లతో కిందపడిపోయాయి. దాదాపు 500 ఎకరాల్లో 50వేలకు పైగా చెట్లు ధ్వంసమయ్యాయని అధికారులు చెబుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 31న సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య రెండు గంటల వ్యవధిలోనే ఈ ధ్వంసం జరిగిపోయింది. కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు చెట్లు నేల కూలాయి. విధ్వంసంలో అడవిలో ఉండే అరుదైన వృక్షాలు కూడా విరిగిపోయాయి. ఎగిస, జువ్వి, నారెప, నల్లమద్ది, తెల్లమద్ది, మారెడు, నేరేడు, ఇప్ప వంటి జాతుల చెట్లు ఉన్నాయి.
భారీ వృక్షాలు సైతం ధ్వంసం అయినా.. అడవి జంతువులకు హాని జరిగిందనే ఆనవాళ్లే కనిపంచలేదు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు కీలక విషయాలు చెప్పారు. పెద్ద విపత్తులోనూ వన్యప్రాణులకు వాటిల్లిన నష్టం ఆనవాళ్లను గుర్తించలేదని చెప్పారు. ఒక జంతువు.. ఒక్క పక్షి గాయపడినట్లు గానీ.. చనిపోయినట్లు గానీ వెలుగు చూడలేదని చెప్పారు. ఏటూరునాగరం అభయారణ్యం పరిధిలో చాలా జంతువులు ఉంటాయి. జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయిలు, కొండ గొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడతలతో పాటు వివిధ రకాల పక్షులు నివాసం ఉంటున్నాయి. వీటిల్లో ఏ ఒక్కదానికి హాని కలిగినట్లు ఆనవాళ్లు లేవన్నారు. అయితే.. వన్యప్రాణులకు ముందే ప్రకృతి విపత్తులను పసిగట్టే గుణం ఉటుందని అధికారులు చెబుతున్నారు. వాసన, శబ్దాలను త్వరగా గుర్తిస్తాయని అంటున్నారు. భూ ప్రకంపణలను పసిగడతాయని చెబుతున్నారు. మరి ఆగస్టు 31న సాయంత్రం సంభవించిన విధ్వంసాన్ని కూడా జంతువులు, పక్షులు ముందే పసిగట్టాయని భావిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయని అనుకుంటున్నారు. మరి జంతువులు, పక్షులు ఎక్కడికి వెళ్లాయనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రకృతి బీభత్సం సృష్టించిన ఘటనలో అధికారులు కూలిన చెట్లను లెక్కిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల్లో విరిగిపడిన చెట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవనుంది.