ఆరుబయట వస్తువులు.. అంధకారంలో బస్తీ.. వర్షం మిగిల్చిన కష్టం అంతా ఇంత కాదు
MBT spokesperson Amjed Ullah Khan visited the flood affected areas in Manchiryala town. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌లో దాదాపు 200 ఇళ్లులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
By అంజి Published on 25 July 2022 3:27 PM IST
ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను వర్షాలు అతాలకుతలం చేశాయి. మంచిర్యాల జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌లో దాదాపు 200 ఇళ్లులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొందరి ఇళ్లులు కూలిపోయాయి. వందలాది కుటుంబాలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులతో పాటు విలువైన సామాన్లు పాడైపోయాయి.
తాజాగా మజిలీస్ బచావో తహరిక్ పార్టీ అధికార ప్రతినిధి అంజాద్ ఉల్లాఖాన్ ఎన్టీఆర్ నగర్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే వరద బాధితులు తమ గోడును అంజాద్‌తో వెళ్లబోసుకున్నారు. వరద బాధితుల సమస్యలను వివరిస్తూ, దెబ్బతిన్న ఇళ్ల ఫొటోలను అంజాద్ ఉల్లాఖాన్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ట్విటర్ పోస్టును రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నియోజకవర్గ ఎమ్మెల్యే దివాకర్ రావుకు, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు ట్యాగ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నగర్‌ను స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా కలెక్టర్ గానీ సందర్శించలేదని ట్విటర్‌లో పేర్కొన్నారు.
గత 15 రోజుల నుంచి ఎన్టీఆర్ నగర్ పూర్తిగా చికటీలో ఉందని, ఇప్పటి వరకు కరెంట్ పునరుద్ధిరించలేదని, వెంటనే కరెంట్‌ను పునరుద్ధరించాలన్నారు. తాగు నీరు కూడా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాగునీటి క్యాన్లను సరఫరా చేయాలన్నారు. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువుల, ఇతర పరికరాలు రోడ్డుపై ఉండటంతో చోరీ అవుతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.
''పద్మ అనే మహిళ 12 సంవత్సరాల క్రితం తన భర్త అంజయ్యను కోల్పోయింది. ఇప్పుడు ఆమెకు ఉన్న ఏకైక ఆధారం ఇల్లు.. భారీ వర్షం కారణంగా పూర్తిగా పాడైపోయింది. ఇంట్లోని మొత్తం వస్తువులు కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ నగర్‌లో ఇటీవలి వర్షాల కారణంగా అన్ని కోల్పోయిన వితంతువులు, పక్షవాతం, కిడ్నీ, క్యాన్సర్ రోగులను కూడా కలిశాను.'' అని అంజాద్ ఉల్లాఖాన్ చెప్పారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇల్లు కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
మంచిర్యాల జిల్లాలోని వరద బాధితులకు సర్కారు సాయం కరువైంది. వరదల్లో ఇండ్లు, పంటలు మునిగిపోయి కోట్లలో నష్టం జరిగింది. చాలామంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు వస్తారని, సాయం చేస్తారని ఎదురుచూస్తున్న ఆ వరద బాధితులకు నిరాశే మిగులుతోంది.