ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫోటోలు విడుదల
Maoist Leader RK Funerals complete.మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అనారోగ్యంతో
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 3:57 PM ISTమావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నాం రెండు గంటలకు ముగిశాయి. ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను తాజాగా మావోయిస్టులు విడుదల చేశారు. తెలంగాణకు సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారయని, ఆయన భౌతిక కాయం పై ఎర్రజెండా ఉంచి మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు పూరైనట్లు వెల్లడించింది.
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే పనిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఆ ప్రకటనలో తెలిపారు. 'ఆర్కే మృతి మా పార్టీకి తీరని లోటు. 1978లో ఆయన పీపుల్స్ వార్ సభ్యత్వం తీసుకున్నారు. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా ఉన్నారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992 రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా, 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. చర్చల తరువాత ఆర్కే హత్యకు ప్రయత్నాలు జరిగాయి. 2004 నుంచి పదేళ్ల పాటు ఏవోబీ కార్యదర్శిగా కొనసాగారు. 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించింది. 2018లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందాడు.' అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలో పేర్కొంది.