వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి.. స్త్రీ జననాంగాలు గుర్తించిన వైద్యులు
ఓ వ్యక్తిలో పురుష జననాంగాలతో స్త్రీ జననాంగాలు కూడా అభివృద్ధి చెందాయి. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
By అంజి Published on 23 Aug 2023 6:59 AM GMTవ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి.. స్త్రీ జననాంగాలు గుర్తించిన వైద్యులు
ఓ వ్యక్తిలో పురుష జననాంగాలతో స్త్రీ జననాంగాలు కూడా అభివృద్ధి చెందాయి. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. సదరు వ్యక్తికి హైదరాబాద్ కిమ్స్ వైద్యులు విజయవంతంగా సర్జరీ చేసి వాటిని తొలగించారు. కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ యురాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వై.ఎం.ప్రశాంత్ తెలిపిన వివరాలు ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పిల్లలు పుట్టలేదు. అందరిలానే ఉంటూ అన్ని పనులు చేసుకొని సాధారణ జీవితం గడపుతున్నాడు. ఈ క్రమంలో అతనికి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో సదరు వ్యక్తి స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల రిఫరెన్స్ మేరకు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.
అతడి ఆరోగ్య పరిస్థితిని గమనించిన కిమ్స్ డాక్టర్ల బృందం.. అల్ట్రాసౌండ్‌తో వివిధ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయన పురుషాంగం సాధారణంగానే ఉంది, కానీ వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉండిపోయాయి. స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్ నాళం, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న కిమ్స్ డాక్టర్లు.. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్ నాళం, గర్భసంచి, స్త్రీ జననాంగం సున్నితంగా తొలగించారు. హార్మోన్ల ప్రభావం కారణంగానే స్త్రీ, పరుష పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందాయని ఆయనకు శస్త్ర చికిత్స చేశామని కిమ్స్ యురాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వై.ఎం.ప్రశాంత్ తెలిపారు.
సాధారణంగా స్త్రీ, పురుషులకు వేర్వేరు జననాంగాలు, పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. కడుపులో పిండం ఏర్పడేటప్పుడు రెండు రకాల అవయవాలు ఉన్నా, ఆ తర్వాత హార్మోన్ల ప్రభావంతో ఏదో ఒకటే అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చాలా అరుదైన కేసుల్లో జన్యు ఉత్పరివర్తనం కారణంగా.. అవసరమైన హార్మోన్లు తగినంత స్థాయిలో విడుదల కాకపోవడంతో స్త్రీ, పురుష పునరుత్పత్తి అవయవాలు రెండూ అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు.