Mancherial: మేకను దొంగిలించారని.. ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడదీసి, ఆపై..

మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీశారు.

By అంజి  Published on  3 Sep 2023 3:20 AM GMT
Mancherial, goat, stealing, torture

Mancherial: మేకను దొంగిలించారని.. ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడదీసి, ఆపై..

మంచిర్యాల జిల్లా మందమర్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి, ఆపై తల కింద పొగబెట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రికి చెందిన కొమురాజుల రాములుకు భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్‌ ఉన్నారు. వీరు అంగడిబజార్‌ ఏరియాలో నివాసం ఉంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల దగ్గర షెడ్డు వేసి మేకలు పెంచుతున్నారు. 19 ఏళ్ల యువకుడు తేజ వీరి దగ్గరే ఉంటూ పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. అతడి తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు, తండ్రి లేడు. 20 రోజుల కిందట మేకల మంద నుంచి ఒక మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయింది. దీంతో తేజతో పాటు అతని స్నేహితుడు చిలుముల కిరణ్‌ (30)లపై యజమాని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇద్దరినీ శుక్రవారం నాడు షెడ్డు దగ్గరికి పిలిచి కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. రామగుండానికి చెందిన కిరణ్‌కు తల్లిదండ్రులు లేరు. అతడు మందమర్రి పట్టణంలో ఉంటున్న అతని చిన్నమ్మ సరిత ఇంటి దగ్గర ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఇంటి నుండి బయటకు వెళ్లిన కిరణ్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చిన్నమ్మ సరిత ఆందోళన చెందింది. ఈ క్రమంలో కిరణ్‌ను కట్టేసి కొట్టిన ఫొటోలు బయటకు రావడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాములు, శ్రీనివాస్‌, స్వరూపతో పాటు వారి వద్ద పనిచేస్తున్న నరేశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, ఎస్సై చంద్రకుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story