రోడ్లు బాగు చేయాలని, కాలుష్యాన్ని అరికట్టాలంటూ ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా లాభం లేకపోవడంతో ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. దుమ్ము, ధూళి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామంటూ రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ నిరసన చేపట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో జరిగింది.
తాండూరు నియోజకవర్గంలోని అంతారం గ్రామంలో అమ్రేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. గ్రామంలో రోడ్లు బాగా లేకపోవడం, కంకర తేలి దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం అమ్రేష్ గ్రామ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి పాడైపై రోడ్డుపై మోకాళ్లపై కొద్దిదూరం నడుచుకుంటూ వచ్చాడు. అనంతరం రోడ్డుపై పడుకుని పొర్లుకుంటూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది చూసినా.. స్థానికులు అతడికి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.