Bhadradri Kothagudem: ఒకేసారి ఇద్దరూ ప్రియురాళ్లతో యువకుడి పెళ్లి
భద్రాద్రి జిల్లా ఎర్రబోరు గ్రామంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఇద్దరు గిరిజన యువతులను ఒకే పెళ్లిలో వివాహం చేసుకున్నాడు.
By అంజి Published on 9 March 2023 3:13 PM ISTBhadradri Kothagudem: ఒకేసారి ఇద్దరూ ప్రియురాళ్లతో యువకుడి పెళ్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఇద్దరు గిరిజన యువతులను ఒకే పెళ్లిలో వివాహం చేసుకున్నాడు. మడివి సత్తిబాబు, స్వప్న కుమారి కొన్నేళ్ల క్రితం చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. శారీరకంగా సన్నిహితంగా మెలిగినప్పటికీ, వారు పలు కారణాలతో వారు వివాహం చేసుకోలేకపోయారు. వారికి ఆడబిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇద్దరూ విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. ఆ తర్వాత కుర్నపల్లి గ్రామానికి చెందిన సునీత అనే మరో యువతితో సత్తిబాబు ప్రేమలో పడ్డాడు. వీరి ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.
అయితే సత్తిబాబు తాజా ప్రేమ వ్యవహారం గురించి స్వప్న కుమారికి తెలిసింది. దీంతో వీరి ట్రయాంగిల్ ప్రేమకథలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అతనికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిసి న్యాయం కోసం సత్తిబాబు పెద్దలను స్వప్న కుమారి ఆశ్రయించింది. విషయం బయటకు రావడంతో పెద్దల అంగీకారంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో జీవించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మూడు కుటుంబాల పెద్దలు సామరస్యపూర్వకంగా ముగ్గురికి పెళ్లి చేయాలని నిర్ణయించి గురువారం ఉదయం 7:30 గంటలకు శుభ ముహూర్తంలో వివాహం జరిపించాలనుకున్నారు.
సంచలనం సృష్టించిన ఈ పెళ్లి వార్త వైరల్‌గా మారడంతో పాటు మీడియా దృష్టిని ఆకర్షించడంతో, కుటుంబ సభ్యులు బుధవారం రాత్రే హడావుడిగా వివాహ వేడుకలు నిర్వహించారు. గురువారం ఉదయం మీడియా ప్రతినిధులు చర్ల గ్రామానికి వెళ్లి వార్తలను కవర్ చేయగా, ఇది పెళ్లి కాదని, పిల్లలకు అన్నప్రాసన (అన్నం తినిపించే) వేడుక అని వారికి సమాచారం అందించారు. అయితే, బుధవారం రాత్రి సత్తిబాబు.. తన ప్రియురాళ్లతో పెళ్లి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.