సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ నిర్వహించతలపెట్టిన ధర్నా కోసం ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాకుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు సంబంధించి నిన్న రాత్రి కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద ఫ్లెక్సీ కడుతూ బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్(23) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై అక్కిడక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అతడితో పాటు ఉన్న కుడుముల వెంకటేష్ అనే మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఫ్లెక్సీలు కట్టేందుకు సునీల్‌ను తీసుకెళ్లిన వ్యక్తి ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకోవడం లేదంటూ మృతుడి బంధువులు, స్నేహితులు అంటున్నారు. సునీల్‌కు సకాలంలో వైద్యం అందిఉంటే.. ప్రాణాలు దక్కేవని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. కాగా.. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.