బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి, డెడ్‌బాడీని ఇంటికి చేర్చిన డ్రైవర్
బస్సులో నిద్రపోయిన హుస్సేన్ అలా నిద్రలో ఉన్నప్పుడే గుండెపోటుకు గురయ్యాడు. బస్సు కండక్టర్ నాగయ్య, డ్రైవర్ కొమురయ్య..
By Srikanth Gundamalla Published on 18 Jun 2023 8:20 AM GMTబస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి, డెడ్‌బాడీని ఇంటికి చేర్చిన డ్రైవర్
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధిన పడుతున్నారు ప్రజలు. పక్కనే ఎవరైనా ఉండి గమనించి ఆస్పత్రికి తీసుకెళ్తే సరే కానీ.. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. అయితే.. ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సులో ఈ ఘటన జరిగింది. అయితే.. ఆయన దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. సదురు బస్సు డ్రైవర్, కండక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. మృతదేహాన్ని తామే బస్సులో తీసుకెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఈ నెల 14న సాయంత్రం ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు వెళ్తున్న బస్సులో చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.
మృతుడు కురవి మండలం మోదులగూడెంకు చెందిన కె.హుస్సేన్‌గా గుర్తించారు. బస్సులో హుస్సేన్ నిద్రలో ఉన్నప్పుడే గుండెపోటుకు గురయ్యాడు. బస్సు కండక్టర్ నాగయ్య, డ్రైవర్ కొమురయ్య సమయస్ఫూర్తితో తోటి ప్రయాణికుల సాయంతో అతనికి సీపీఆర్ చేశారు. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశారు. కానీ.. అప్పటికీ ఎలాంటి కదలికలు లేకపోవడంతో నాడి చూశారు. ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకున్నారు. ఇక అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. కానీ బస్సు డ్రైవర్, కండక్టర్ మాత్రం అలా వదిలేయడానికి ఇష్టపడలేదు. మృతదేహాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సదురు బస్సు డ్రైవర్, కండెక్టర్‌ను అభినందించారు. సేవా భావంతో వ్యవహించిన వారి తీరు వారికి గుర్తింపు తెస్తుందన్నారు. డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్య ను బస్‌భవన్‌కు పిలిచి మరీ వారిని సత్కరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.