ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత
సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు.
By అంజి
ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత
సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. స్మితా సబర్వాల్ ఎక్స్‌లో దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమే కాక, వారి సామర్థ్యాన్ని ఆమె ప్రశ్నిస్తున్నట్టు, వారిపై ఆమెకు గల చులకన భావాన్ని ప్రకటిస్తున్నాయని అన్నారు. ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదని అన్నారు. దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. ఇద్దరం పరీక్ష రాద్దాం.. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? అంటూ స్మితా సబర్వాల్‌కు బాలలత సవాల్ విసిరారు.
24 గంటల్లో మీ (స్మితా సబర్వాల్) వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారని అన్నారు. స్మితకు చీఫ్ సెక్రెటరీ షోకాజ్ నోటీసు ఇవ్వాలని బాలలత డిమాండ్ చేశారు. స్మిత సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, దివ్యాంగుల చట్టం - 2016, భారతీయన న్యాయసంహిత (2023) - సెక్షన్ 196,197,198, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 చట్లాల ఉల్లంఘనకు పాల్పడ్డారని బాలలత అన్నారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతంగా చేశారా లేక ప్రభుత్వ అభిప్రాయాలా అని ప్రశ్నించారు.
''రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పునుల స్మిత సబర్వాల్ వ్యతిరేకిస్తున్నారా? ప్రీమియర్ సర్వీసెస్ అనగా ఆమె ఉద్దేశ్యంలో ఏమిటి? ప్రజా సేవకులా? ప్రజల మీద పెత్తనం చేయువారా? దివ్యాంగులు ఎక్కువ సేపు పని చేయలేరు అని వారి సమర్థతను నిర్ణయించడానికి, శంఖించడానికి ఈమెకు గల శాస్త్రీయ ప్రాతిపదికలు ఏమిటి? దివ్యాంగుల పట్ల సహానుభూతి లేని ఈమె వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని మాజీ అధికారిణి, దివ్యాంగురాలు మల్లవరపు బాలలత, అభిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
సివిల్ సర్వీసెస్‌కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్‌లో ప్రశ్నించారు. దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉందని అన్నారు. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగులను నియమించుకోగలవా? అని ప్రశ్నించారు. పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవని, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి, వీటిలో రిజర్వేషన్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఆమె ట్వీట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.