ఈసీ సంచలన నిర్ణయం, తెలంగాణ ఎన్నికలకు ముందు పలువురు అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 4:26 PMఈసీ సంచలన నిర్ణయం, తెలంగాణ ఎన్నికలకు ముందు పలువురు అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 13 మంది పోలీసు ఉన్నతాధికారులు, ఒక ఐఏఎస్, నలుగురు కలెక్టర్లను బదిలీ చేసింది.
వీరిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్, నిజామాబాద్ పోలీస్ చీఫ్ వీ సత్యనారాయణ ఉన్నారు. పోలీసు సూపరింటెండెంట్‌ల జాబితాలో ఎస్పీ --సంగా రెడ్డి- ఎం రమణ, కామారెడ్డి - బి శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల - ఎ భాస్కర్, మహబూబ్ నగర్ - కె నరసింహ, నాగర్ కర్నూల్ - కె మనోహర్, జోగులాంబ గద్వాల్ - కె సృజన, మహబూబాబాద్ - జి చంద్రమోహన్, నారాయణపేట - ఎన్ వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాలపల్లి - పి కరుణాకర్, సూర్యాపేట - రాజేందర్ ప్రసాద్ ఉన్నారు. బదిలీ అయిన నలుగురు కలెక్టర్లలో రంగారెడ్డి- బి భూపాల్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి- డి అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి- వినయ్ కృష్ణా రెడ్డి, నిర్మల్- విష్ణు రెడ్డి ఉన్నారు.
డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్- ఐఏఎస్ అధికారి ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ ఇటీవల బదిలీ అయ్యారు. "రాష్ట్ర ఎన్నికలు 2023 పూర్తయ్యే వరకు వారిని (బదిలీ చేసిన అధికారులు) ఎటువంటి ఎన్నికల పనులకు కేటాయించకూడదు" అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఎండోమెంట్ శాఖల అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. పూర్తి సమయం బాధ్యతలు తీసుకునే ప్రిన్సిపల్ సెక్రటరీ -ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, ఎండోమెంట్‌ని వెంటనే నియమించాలని CS ను ఆదేశించారు. మద్యం, డ్రగ్స్, ఉచితాల ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ టి.కె.శ్రీదేవిని కూడా బదిలీ చేశారు. అదనంగా, రవాణా శాఖ కార్యదర్శి - కెఎస్ శ్రీనివాస్ రాజు తక్షణమే కార్యాలయం నుండి బయటకు వెళ్లాలని కోరారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్:
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణలో 119 నియోజకవర్గాలు, రాజస్థాన్‌లో 200, మద్యప్రదేశ్‌లో 230, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40 నియోజకవర్గాలున్నాయి. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఉన్నారు. ఇక మద్యప్రదేశ్‌లో 5.6 కోట్లమంది, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఉండగా మిజోరాంలో 8.52 లక్షలమంది ఓటర్లున్నారు.
మిజోరాంలో ఒకే విడతలో నవంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 7, 17న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 30న తెలంగాణలోనూ.. మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న, రాజస్థాన్‌లో 23న ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 3న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. డిసెంబరు 5తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. కేవలం ఛత్తీస్‌గఢ్‌లోనే రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
ఈ ఐదు రాష్ట్రాలలో జరిగిన సమీక్షా సమావేశాల సందర్భంగా, ఎన్నికల ప్రక్రియలో ప్రేరేపణల పంపిణీ పట్ల ఎక్కువ నిఘా, జీరో టోలరెన్స్ కోసం పోల్ ప్యానెల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా అధికారులను ఆదేశించింది. "మద్యం, నగదు, డ్రగ్స్, ఉచితాల తరలింపు, పంపిణీని అడ్డుకోవాలని కమిషన్ ఆదేశించింది. న్యాయమైన ఎన్నికలకు మా మొదటి ప్రాధాన్యత" అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.
EC అందుకున్న ఇన్‌పుట్‌ల ప్రకారం హర్యానా, పంజాబ్‌ల నుండి అక్రమ మద్యం హనుమాన్‌గఢ్, చురు, జుంజును, అల్వార్ జిల్లాల ద్వారా రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తోందని సమాచారం అందింది. ఈ సున్నితమైన జిల్లాల్లోని అధికారుల పనితీరును అంచనా వేసిన కమిషన్ హనుమాన్‌గఢ్, చురు, భివాడి పోలీసు సూపరింటెండెంట్‌లను (ఎస్‌పిలు), రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా ఎన్నికల అధికారి (డిఇఒ)లను బదిలీ చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో జరిగిన సమీక్షా సమావేశంలో, అనేక మంది నాన్-క్యాడర్ అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారని, పరిపాలనా, పోలీసు సేవలకు చెందిన అధికారులకు ముఖ్యమైన పోస్టింగ్‌లు ఇచ్చారని కమిషన్ గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు.
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని ఉపయోగించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సమయంలో పటిష్టమైన విధులను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
మిజోరం, రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని BSF, అస్సాం రైఫిల్స్‌తో సహా సంబంధిత భద్రతా ఏజెన్సీలను ఆదేశించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర మరియు కర్ణాటకలలో గత ఆరు అసెంబ్లీ ఎన్నికలలో 1,400 కోట్లకు పైగా జప్తులు జరిగాయి. నగదు, మద్యం, డ్రగ్స్, ఉచిత వస్తువుల అక్రమ తరలింపు కోసం అనుసరించే ఏదైనా నిర్దిష్ట మార్గాలు, పద్ధతులను అడ్డుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.